ఎల్లారెడ్డి, 2 September
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో 420 హామీలు.. 420 ఫిట్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ భారీ నిరసన
‘420 హామీలు.. 420 ఫిట్లు’ అంటూ ఆందోళన
ఎల్లారెడ్డి, సెప్టెంబరు 2 (మనోరంజని తెలుగు టైమ్స్): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘420 హామీలు.. 420 ఫిట్లు’ అనే ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, రాష్ట్ర జడ్పీటీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పచ్చి మోసమని విమర్శించారు. ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ‘వచ్చే నెల.. వంద రోజులు’ అంటూ ప్రజలను నమ్మించి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని వారు ఆరోపించారు.
బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులను తీవ్రంగా నిరాశపరిచిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.












