బాన్సువాడ, 2026-06-05
బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనవసరమని, కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనులకు నిధుల విడుదలపై మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనవసరమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పార్టీ మారాల్సి వచ్చిందని, మాజీ సీఎం కేసీఆర్ను మోసం చేసి కాంగ్రెస్ లో చేరడం తనకు ఇష్టం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, అన్నం పెట్టిన వారిని మరచిపోవడం తనకు కష్టమని పోచారం పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని, జాతీయ జెండానే కప్పుకున్నానని స్పష్టం చేశారు.
నిధుల విడుదలపై అసంతృప్తి
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, ఆరు నెలల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతోనే తాను కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని పోచారం తెలిపారు. అయితే, నిధుల కోసం మంత్రులు పొంగులేటి, భట్టి, వేం నరేందర్ రెడ్డిలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. సీఎం చెప్పినప్పటికీ మంత్రులు నిధులు విడుదల చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎంను సూటిగా ప్రశ్నించిన వైనం
నవంబర్లో జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని తాను సూటిగా ప్రశ్నించినట్లు పోచారం వెల్లడించారు. నేను నీకు అమ్ముడుపోయానా నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని తాను ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.











