న్యూఢిల్లీ, 5 August
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తోందని, పార్లమెంటుతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా రీల్స్‌లో బిజీగా ఉంటుండగా, హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ నిరసనలపై పార్లమెంటులో వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తోందని, ప్రజాస్వామ్య దేశానికి కీలకమైన పార్లమెంటుతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ 'హలో ఫ్రెండ్స్' అంటూ సోషల్ మీడియా రీల్స్‌లో బిజీగా ఉంటున్నారని, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసుల దాష్టీకం, ఆ తర్వాత పెట్టిన కేసులపై పార్లమెంటులో వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత నెల 20న ఢిల్లీలో జరిగిన 'పార్లమెంట్ మార్చ్' నిరసనల సందర్భంగా విద్యార్థులు, యువకులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికీ పార్లమెంటులో వివరణ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన పార్లమెంటుకు హాజరుకావడం లేదని, ఢిల్లీ నిరసనలు జరిగి రెండు వారాలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారిందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. మోడీ, అమిత్ షాల తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని తెలిపాయి.
నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బాష్పవాయువు, లాఠీచార్జి, పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై కేంద్రం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు రెండు వారాలుగా డిమాండ్ చేస్తున్నా, అమిత్ షా సభకు హాజరుకాకపోవడం గమనార్హమని ప్రతిపక్షాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసు విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో పని చేస్తున్నందున, జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనలపై కేంద్ర హోం మంత్రి నేరుగా పార్లమెంటుకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ప్రతిపక్షం వాదిస్తోంది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే ప్రధాని మోడీకి డిమాండ్ వినిపించారు. మరోవైపు ప్రధాని మోడీ కూడా పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారని, ఆయన గతానికి భిన్నంగా యువతను ఆకర్షించేలా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా ఐదు రీల్స్ విడుదల చేశారని, అయితే ఇందులో విద్యార్థుల నిరసనలు, ఢిల్లీ పోలీసుల చర్యలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి అంశాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రతిపక్షం ప్రజలకు గుర్తుచేస్తోందని పేర్కొంది.
రాజ్యసభలో ఎంఎస్ఎంఈ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు అజయ్ మాకెన్, సీపీఐ(ఎం) సభ్యుడు జాన్ బ్రిట్టాస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యురాలు డోలా సేన్, ఇతర సభ్యులు హోంమంత్రి గైర్హాజరు, నిరుద్యోగం, విద్యార్థుల నిరసనల అంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే, సభకు అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షుడు హరివంశ్ పలుమార్లు జోక్యం చేసుకుని బిల్లుకు సంబంధించిన అంశాలకే పరిమితమవ్వాలని సూచించారు. సభా నాయకుడు, బీజేపీ నేత జేపీ నడ్డా కూడా బిల్లుతో సంబంధం లేని వ్యాఖ్యలు రికార్డులో ఉండకూడదని అన్నారు. సీపీఐ సభ్యుడు సందోష్ కుమార్ పి. ‘‘ఎంఎస్ఎంఈ అంటే.. మినిస్టర్ షా మస్ట్ ఎక్స్క్యూస్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరినా, దానిని కూడా చైర్మెన్ అడ్డుకోవడం గమనార్హమని తెలిపింది.












