చిత్తూరు, 5 August
హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి యాదగిరిగుట్ట పాలక మండలిలో సభ్యత్వం కోసం ఒక కీలక నేతకు రూ.కోటి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆ వ్యాపారి తీవ్ర నిరాశకు గురయ్యారు.
హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి ధార్మిక సేవల్లో గుర్తింపు, గౌరవం పొందాలనే ఆశతో యాదగిరిగుట్ట పాలక మండలిలో చోటు కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోని ఒక కీలక నేతను సంప్రదించగా, షరతులు పూర్తి చేస్తే సభ్యత్వం ఇప్పిస్తానని సదరు నేత హామీ ఇచ్చారు. అందుకు అంగీకరించిన వ్యాపారి, రెండు విడుతల్లో రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
పాలక మండలిలో చోటు వస్తుందని ధీమాతో ఉన్న వ్యాపారి, తన సన్నిహితులు, బంధువులకు ఈ విషయం చెప్పారు. పదవి వచ్చిన తర్వాత వ్యాపార వర్గాల నుంచి సత్కారాలు ఎలా అందుకోవాలనే దానిపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో వ్యాపారి షాక్‌కు గురయ్యారు. సదరు కీలక నేతకు ఫోన్ చేస్తే స్పందించలేదని తెలిసింది.
తరువాత, వ్యాపారి తనను పరిచయం చేసిన వ్యక్తుల ద్వారా కీలక నేత ఇంటికి వెళ్లి తన డబ్బులు వెనక్కి అడిగారు. 'నా ప్రయత్నాలు నేను చేశాను, ఇప్పుడు ఏం చేస్తాం.. ఇంకా ఏదైనా పనిచేసి పెడతాను' అని చెప్పి ఆ నేత బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. రెండు మూడు రోజుల తర్వాత వ్యాపారి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నేతకు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పెట్టినా స్పందన లేదని, ఇంటికి వెళ్లినా కలవడం లేదని సన్నిహితులకు చెప్పి విలపిస్తున్నట్లు తెలిసింది.
యాదగిరిగుట్ట పాలక మండలిలో తమ సన్నిహితులకు, బంధువులకు అవకాశం కల్పించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. కొందరు ఢిల్లీ స్థాయిలో కూడా పైరవీలు చేశారు. అయితే, పార్టీలోని ఒక కీలక నేత తన కోటాలో కొందరిని బోర్డులోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సిఫారసు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి పేరును కూడా తన సిఫారసు జాబితాలో చేర్చినట్లు సమాచారం.
పదవులు ఇప్పిస్తామని ఎవరెవరు, ఎవరి వద్ద ఎంత మొత్తంలో వసూళ్లు చేస్తున్నారనే సమాచారం సీఎంకు చేరింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బోర్డులో సిఫారసులకు తావివ్వకుండా ఆయనే స్వయంగా చైర్మన్, సభ్యుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పారదర్శకంగా నియామకాలు చేపట్టడం వల్ల ఆలయ అభివృద్ధికి కావాల్సిన నిధుల సమీకరణపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, అందుకే పారిశ్రామిక, వ్యాపార, సామాజిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పాలక మండలి నియామకంపై వివాదం తలెత్తినప్పుడు, 'బోర్డు నియామకంపై అందరూ సంతోషంగా ఉన్నారు. ఇబ్బంది ఉంటే పదవి ఇప్పిస్తానని ఒక గుప్తా నుంచి రూ.కోటి తీసుకున్న లీడర్‌కు బాధ ఉండొచ్చు' అని సీఎం సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.












