మిర్యాలగూడ, జూలై 3
మిర్యాలగూడ నియోజకవర్గంలో 'ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మిర్యాలగూడ మండలంలోని చిల్లాపురం గ్రామంలో రెండ్రోజులు పర్యటించారు. గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట' కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మిర్యాలగూడ మండలంలోని చిల్లాపురం గ్రామంలో రెండ్రోజుల పాటు విస్తృతంగా పర్యటించి గ్రామ ప్రజలతో మమేకమయ్యారు.
పల్లెబాటలో భాగంగా గురువారం రాత్రి గ్రామంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, యువత, గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు.
ప్రజలు నేరుగా వినిపించిన ప్రతి సమస్యను శ్రద్ధగా ఆలకించి, సంబంధిత అధికారుల సమక్షంలోనే వాటిని నమోదు చేయించి, పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోనే రాత్రి బస చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రజలతో కలిసి భోజనం చేసి వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు.
గ్రామ ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటించి వారి కుటుంబ పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం గ్రామంలో నిర్మాణం పూర్తయిన 7 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, గ్రామ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
కార్యక్రమంలో ఎంపిడిఓ ఎం.శేషగిరిశర్మ, పంచాయతీ రాజ్ ఎఇ వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ నాయకులు దిరావత్ స్కైలాబ్ నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి, ఆర్.జగ్గారెడ్డి, పేలపోలు శ్రీనివాస్, వెంకటయ్య, ఎస్కె జిందా, బసవయ్య గౌడ్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










