ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎంటీ బేరింగ్స్ మౌలాలిలో కార్మికోద్యమ నాయకుడిగా సేవలందించిన బి. కోటేశ్వరరావు (82) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య కరోనా కాలంలో మృతి చెందారు.
కోటేశ్వరరావు అంత్యక్రియలు బుధవారం రాంపల్లిలోని శ్మశానవాటికలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి ఆయన భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోటేశ్వరరావు మృతి కార్మిక ఉద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. చివరి క్షణం వరకు ఉద్యమాలకే అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. హెచ్ఎంటీ బేరింగ్స్లో ఉద్యోగిగా ఉన్న కాలంలో కార్మిక ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది నాయకులను తీర్చిదిద్దారని తెలిపారు.
విరమణ అనంతరం కూడా ప్రజాస్వామ్య ఉద్యమాలు, పెన్షనర్ల సంఘం కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం పనిచేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
నివాళులర్పించిన వారిలో హైదరాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి పి.ఎస్.ఎన్. మూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.జి. నర్సింహారావు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాధ్యులు జి. బుచ్చిరెడ్డి, ఎన్. సోమయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి. సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె. చంద్రశేఖర్, ఎం. వినోద్, జిల్లా కమిటీ సభ్యులు జె. వెంకన్న, గుంటి లక్ష్మణ్, ఉన్ని కృష్ణన్, శ్రీమన్నారాయణ, ఆదినారాయణ, బంగారు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.












