తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఉద్యమకారుల మధ్య నెలకొన్న అసంతృప్తి, ఉపాధ్యాయ సంఘాల మధ్య తలెత్తిన వివాదంపై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టతనిచ్చారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అందరినీ కలుపుకొని కార్యక్రమాలు నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమకారులందరికీ తగిన గుర్తింపు, గౌరవం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
స్థానికంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సందర్భంగా జరిగిన ఉద్యమకారుల సన్మాన సభలో ఒకే వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇచ్చి, మిగతా వర్గాలను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పలువురు తెలంగాణ ఉద్యమకారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం క్రమంగా ముదిరి, ఉపాధ్యాయ జేఏసీ సంఘాల మధ్య వివాదంగా మారి చివరకు మీడియా వరకు చేరింది.
ఈ నేపథ్యంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆనాటి టీచర్స్ జేఏసీ ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, చేసిన ఆందోళనలు, ఉద్యమంలో పాల్గొన్న నాటి పరిస్థితులను ఎమ్మెల్యేకు వివరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమకారుల త్యాగాలను గుర్తుచేస్తూ తమ ఆవేదనను ఎమ్మెల్యే ముందు వెల్లడించారు.
ఆనాటి టీచర్స్ జేఏసీ అధ్యక్షులు, ఈనాటి టీయూ జేఏసీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆర్థికంగా కూడా వెనుకాడకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యేకు మంచి పేరు రావాలని, అయితే ఆయన చుట్టూ ఉన్న కొందరి కారణంగా ఉద్యమకారుల్లో అసంతృప్తి ఏర్పడటం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిజంగా పాల్గొన్న పలువురు ఉద్యమకారులను పక్కన పెట్టడం, అమరవీరుల స్తూపం ఏర్పాటు సందర్భంగా జరిగిన సభలో అందరికీ సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వేదికపైకి పలువురిని ఆహ్వానించకపోవడం వంటి అంశాలు తమను తీవ్రంగా బాధించాయని శ్రీధర్ రెడ్డి తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరైన కార్యక్రమంలోనూ మిగతా సంఘాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఒకే సంఘానికి చెందిన వారే అన్నీ తామై వ్యవహరించడం వల్ల తమలాంటి అనేకమంది ఉద్యమకారులు సభా సాక్షిగా అవమానానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవాన్ని, ఉద్యమకారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అందిస్తున్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పెద్ద వివాదంగా చేయాలనే ఉద్దేశం తమకు లేదని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే తమ అసంతృప్తిని బయటపెట్టామని తెలిపారు. అయితే, తనను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, తాను తెలంగాణ ఉద్యమం నుంచి పారిపోయిన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం మీడియా ద్వారా జరిగిందని శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎంతోమంది ఉపాధ్యాయులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశారని, వారి పాత్రను విస్మరించి ఒకే సంఘానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం, వారికి సంబంధించిన వ్యక్తులను మాత్రమే వేదికపైకి ఆహ్వానించడం వంటి అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.












