నందిగాంలో రేకుల షెడ్డు దగ్ధం…4 లక్షల ఆస్తి నష్టం
ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితుని వేడుకోలు
తానూరు మనోరంగని ప్రతినిధి నవంబర్ 8
తానూర్ మండలం నందిగాం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ నిరుపేద కుటుంబం సర్వం కోల్పోయింది. మున్కర్వార్ ఆనంద్ అద్దెకు ఉంటున్న రేకుల షెడ్డులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో షెడ్డు పూర్తిగా దగ్ధమైంది, అందులో రూ,2.30 లక్షల నగదు, రెండు తులాల బంగారం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వీటితో పాటు ఇంటి సామగ్రి, వస్తువులు, ఆహారపు ధాన్యాలు కూడా కాలిపోవడంతో బాధిత కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో రేకుల షెడ్డుకు కూడా మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న సోయా, వేరుశనగ బస్తాలు, శనగ విత్తనాలు, డీఏపీ ఎరువులు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం రూ 4 లక్షల పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆనంద్ వాపోయాడు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై హన్మండ్లు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర నష్టంతో రోడ్డున పడిన నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.