‘పోషణ మాసంలో పౌష్టికాహారం పై అవగాహన
తానూర్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 13
మండల కేంద్రమైన తానూర్‌లోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీడీపీఓ సరోజని మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం ఎంత ముఖ్యమో వివరించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్థానికంగా లభించే చౌకైన, బలవర్ధకమైన ఆహార పదార్థాలను వినియోగించడంపై విలువైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ టీమ్ డిసి రోజా, సూపర్వైజర్ ఉమ, తానూర్ సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.