భైంసా కార్మిక శాఖలో పెయింటర్ యూనియన్ సమావేశం — స్థానిక కార్మికుల సమస్యల పరిష్కారంపై చర్చ
మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి – అక్టోబర్ 16, 2025
భైంసా కార్మిక శాఖ కార్యాలయంలో గురువారం పెయింటర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశానికి రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కామ్రేడ్ మారగొని ప్రవీణ్ కుమార్, ఏఎల్ఓ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సమావేశంలో యూనియన్ సలహాదారులు షేక్ లతీఫ్, గోపి, అధ్యక్షులు కామ్రేడ్ సి.హెచ్. లక్ష్మణ్, కార్యదర్శి కామ్రేడ్ అనిల్ సింగ్, ఉపాధ్యక్షుడు కామ్రేడ్ జావేద్, సహాయ కార్యదర్శి కామ్రేడ్ మొహసిన్ తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ప్రత్యేకంగా, ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు రావడం వల్ల స్థానిక పెయింటర్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఒక పెయింటర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
సభలో చట్టబద్ధమైన రిజిస్టర్డ్ యూనియన్ సభ్యత్వం తప్పనిసరి చేయాలని, అలాగే ఒక్కో కాంట్రాక్టర్ వద్ద ఐదుగురి కంటే ఎక్కువ పనివారిని ఉంచరాదని నిర్ణయించారు.
చక్పెల్లి గ్రామానికి చెందిన షేక్ షఫీ, సాబేర్ అహ్మద్, జమీర్, అక్రమ్, మొహసిన్, సాహిర్, అమర్ లు యూనియన్లో కొత్తగా సభ్యత్వం పొందారు. ఏఎల్ఓ వినోద్ ఇతర రాష్ట్రాల కార్మికులు సమావేశానికి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భవిష్యత్లో వారిని కూడా చర్చలకు తీసుకురావడానికి పై అధికారులతో సంప్రదిస్తానని తెలిపారు.
సమావేశం శాంతియుతంగా నిర్వహించినందుకు రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ యూనియన్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి సమావేశంలో ఇతర రాష్ట్రాల కార్మికులను కూడా ఆహ్వానించి సమస్యకు పూర్తి పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించారు