ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ అమలు
46,85,838 మంది రైతులకు పథకంతో లబ్ది
మొదటివిడతలో ఒక్కో రైతుకు రూ.5,000
రూ.2,342.92 కోట్ల నిధుల కేటాయింపు
కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు జమ
ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా లబ్దిదారులకు సందేశం
సాగునీటి ఎద్దడి, ఎరువుల కొరత రానివ్వకండి
జిల్లా కలెక్టర్లకు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
సందేహాల నివృత్తికి 155251 టోల్ ఫ్రీ నెంబర్
అమరావతి, జూలై 31:- కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఆగస్ట్ 2న అమలు చేయాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ది పొందుతారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్ల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.
రైతులకు సాయం భారం కాదు… బాధ్యత
‘అన్నదాత సుఖీభవ’ అమలు సన్నద్ధతపై గురువారం సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, జలవనరులు, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతీ రైతుకూ అన్నదాత సుఖీభవ అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదు.. బాధ్యతగా గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు నిధులే కాదు.. నీళ్లూ ఇస్తున్నామని చెప్పారు.
ప్రజల విశ్వసాన్ని నిలబెట్టుకున్నాం
‘ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలి. గ్రామ సచివాలయం నుంచి పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలి. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. నాడు ఆర్థిక విధ్వంసం జరిగింది. ప్రతీ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నాం. ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులకు హామీ ఇచ్చినట్టుగానే ‘అన్నదాత సుఖీభవ’ను అమలు చేసి చూపించాం. పథకాలు అమలు చేస్తూ ప్రజల విశ్వసాన్ని నిలబెట్టుకున్నాం. చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి. రాజకీయ నేతలు పాలసీలు మాత్రమే తయారు చేస్తారు… వాటిని అమలు చేసేది అధికారులే. వ్యవస్థలో అందరూ జావాబుదారీతనంతో వ్యవహరించాలి. అన్నదాత సుఖీభవ అందుకునే రైతులకు సెల్ ఫోన్లకు ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు వెళ్లాలి. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించండి.’ అని ముఖ్యమంత్రి అన్నారు.
వ్యవసాయ ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం
‘ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. బొప్పాయి ధర తగ్గిందని కథనాలు వస్తున్నాయి… వాటిపైనా సమీక్ష చేసి రైతులకు న్యాయం చేయాలి. ఎరువుల విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి… ఎక్కడా కొరత రానీయొద్దు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టులను వందశాతం నీటితో నింపాలి. రిజర్వాయర్లలో ఎంత నీరు ఉందనే సమాచారం ఉండాలి. నీటి నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలి. భారత్‌పై అమెరికా 25 శాతం సుంకాలు విధించింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనాలి. ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం అందించిన సాయం, ఇతర వివరాలతో కరపత్రం రూపొందించి క్షేత్రస్థాయిలో ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.
ఆగస్ట్ 2న ఒక్కో రైతుకు మొత్తం రూ.7,000 జమ*
ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20,000 చొప్పున అందిస్తామన్న కూటమి హామీని ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ అమలుతో నెరవేర్చినట్టయ్యింది. ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14,000 ఇవ్వనుంది. మొదటి, రెండో విడత రూ.5 వేల చొప్పున, అలాగే మూడో విడత రూ.4 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ రూ.14 వేలను 3 విడతలుగా అందించాలని గతంలోనే నిర్ణయించారు. కేంద్రం మొదటివిడతగా రూ.2,000 చొప్పున రూ.831.51 కోట్లు రైతులకు సాయం చేయనుంది. దీంతో ఆగస్ట్ 2న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7,000 జమ చేసినట్టు అవుతుంది. మరోవైపు ‘అన్నదాత సుఖీభవ’కు సంబంధించి 59,750 గ్రీవెన్సులు నమోదుకాగా… వాటిలో 58,464 దరఖాస్తులను పరిష్కరించారు. ఈ పథకంపై సందేహాలను నివృత్తి చేసేందుకు 155251 టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచారు.
ఈ సమీక్షలో సీఎస్ కె.విజయానంద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మీ, సీఎం ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పియూష్ కుమార్, సీఎం కార్యదర్శి రాజమౌళి, అగ్రికల్చర్ డైరెక్టర్ డిల్లీరావు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.