భయపెట్టేశారు భయ్యా.. భారత్ ను ఓడించినంత పనిచేసిన ఒమన్
Asia Cup 2025, IND vs OMAN: ఆసియా కప్ 2025 లో భాగంగా శుక్రవారం భారత్ vs ఒమన్ తలపడ్డాయి. అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఒమన్ కూడా అద్భుతమైన ఆటతో భారత్ కు పోటీ ఇచ్చింది.
అబుదాబి షేఖ్ జాయెద్ స్టేడియంలో ఆసియా కప్ 2025లో గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో భారత్, ఒమన్‌కు 189 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఒమన్ అద్భుతమైన ఆటతో భారత్ కు గట్టిపోటీ ఇచ్చింది. అయితే, విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత్ ను దాదాపు ఓడించేంత పనిచేసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. జట్టు మొదటి వికెట్ 6 పరుగుల వద్దే కోల్పోయింది. శుభ్మన్ గిల్ తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.
తర్వాత అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం అందించారు. భారత్ 72 పరుగులతో వుండగా అభిషేక్ ఔటయ్యాడు. అతను 15 బంతుల్లో 2 సిక్స్‌లు, 5 ఫోర్లతో 38 పరుగుల నాక్ ఆడాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టి 56 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. సంజూ హాఫ్ సెంచరీ నాక్ జట్టుకు బలమైన పునాది వేసింది. మరోవైపు తిలక్ వర్మ 18 బంతుల్లో 29 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా (1), శివం దూబే (5) తక్కువ స్కోరుతో వెనుదిరిగారు. అక్షర్ పటేల్ 13 బంతుల్లో 26 పరుగులు సాధించాడు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో త్వరగా క్రీజులోకి రాకుండా, ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. హర్షిత్ రాణా (13), అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ (1*) కూడా బ్యాటింగ్ చేశారు. మొత్తం 20 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
ఒమాన్ బౌలర్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆ జట్టు బౌలర్లలో షా ఫైసల్ 2 వికెట్లు తీశాడు. జితేంద్ర రమానంది 2 వికెట్లు తీశాడు. ఆమీర్ కలీమ్ కూడా 2 వికెట్లు సాధించాడు.
189 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఒమన్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. విజయం దిశగానే ఆ జట్టుకు ముందుకు సాగింది. అయితే, విజయానికి కావాల్సిన రన్ రేటు పెరగడంతో విజయం అందుకోలేకపోయింది. కానీ, భారత్ తో గట్టిగానే పోరాడింది. ఓడించేంత పనిచేసింది.
ఒమన్ ప్లేయర్లలో మీర్జా ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (51 పరుగులు) కొట్టాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే అద్భుతమైన షాట్స్ తో అదరగొట్టాడు. ఓపెనర్ అమీర్ కలీం 64 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. కెప్టెన్ జతిందర్ సింగ్ 32 పరుగుల నాక్ ఆడాడు. అమీర్ కలీం, జతిందర్ సింగ్ లు రన్ రేటు మెరుగ్గా పెంచుకుంటూ ఆడివుంటే మ్యాచ్ భారత్ చేతినుంచి జారిపోయే పరిస్థితి వుండేది. చివరి ఓవర్లలో ఒమన్ వికెట్లను చేజార్చుకుంది.
20 ఓవర్లలలో ఒమన్ 167/4 పరుగులు చేసింది. 21 పరుగుల తేడాతో ఓడిపోయింది