ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాద్ షీ టీం బృందం
నిజామాబాద్, అక్టోబర్ 4 (M4News):
మహిళలు, చిన్నారుల భద్రత – సురక్షతను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీం బృందం అప్రమత్తంగా పని చేస్తోంది. ఈ నెలలో ఆకతాయిల వేధింపులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., తెలిపారు.
దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాత్రి సమయాలలో మహిళలను వేధించే ఆకతాయిలపై షీ టీం బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని 19 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందం రాత్రి పహారాలు వేస్తూ, మహిళలకు భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు.
గత నెలలో షీ టీం బృందం 80 హాట్స్పాట్‌లలో తనిఖీలు నిర్వహించి, 11 ఈ-పెట్టీ కేసులు నమోదు చేసిందని, 07 కౌన్సెలింగ్‌ల ద్వారా సమస్యలు పరిష్కరించబడినట్లు తెలిపారు. అదేవిధంగా 26 గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, చైల్డ్ మ్యారేజ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాలపై చైతన్యపరచినట్లు వివరించారు.
ఈ నెలలో మహిళల నుంచి వచ్చిన 07 ఫోన్ కాల్స్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు.
మహిళలు, చిన్నారులు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా నిజామాబాద్ షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటుందని, అవసరమైతే 8712659795 నంబర్‌కు కాల్ చేయాలని కమిషనర్ సాయి చైతన్య సూచించారు.
ఈ కార్యక్రమంలో మహిళా ఆర్‌ఎస్‌ఐ శ్రవంతి, హెడ్ కానిస్టేబుల్‌లు సుమతి, ఆశయ్యా, కానిస్టేబుల్‌లు విగ్నేష్, శ్రీకాంత్, నాగరాజు, రేఖా రాణి, హరిత రాణి, రాధిక తదితర షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.