అమరావతి, 2026-08-21
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో అక్షర దోషాలు, సాంకేతిక సమస్యలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో నేరస్తుల తరహాలో ఫోటోలు తీస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. లక్షలాది మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, వీటిలో అధిక శాతం అక్షర దోషాలు, తప్పులేనని తెలుస్తోంది. దీంతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమం ప్రజానీకానికి చేదు అనుభవాలను మిగులుస్తోంది. ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేస్తున్న వారిలో అత్యధిక మంది అక్షర దోషాలతో ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో నేరస్తుల తరహాలో వీరి ఫోటోలు తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 44.25 లక్షల మందికి పైగా నోటీసులు జారీ చేయాల్సి ఉంది. వీటిలో అత్యధికం అక్షర దోషాలు, సాంకేతిక సమస్యలేనని తెలుస్తోంది.
ప్రజలకు భారంగా మారిన ప్రక్రియ
ప్రభుత్వ సిబ్బందే ఇళ్ల దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే సులభంగా పరిష్కారమయ్యే సమస్యలకు సైతం తమ కార్యాలయాలకు రావాలని అధికారులు ఆదేశించడం, పైగా తేది, సమయం కూడా నిర్ధారిస్తుండటంతో ప్రజలకు ఇది పెనుభారంగా మారుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు, దేశాలకు కూడా వెళ్తున్న ఓటర్లను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఇంగ్లీషుపై ఆధారపడటంతోనే తప్పులు
ఓటర్ల వివరాలను నిర్ధారించడానికి అధికారులు తెలుగుకన్నా ఇంగ్లీషుమీదనే ఎక్కువగా ఆధారపడటం కూడా చర్చనీయాంశంగా మారింది. పెద్ద సంఖ్యలో పేర్లు తెలుగులో సరిగానే కనిపిస్తున్నప్పటికీ, ఇంగ్లీషులో సరైన స్పెలింగ్ టైపు చేయకపోవడంతో తప్పులుగా కనిపిస్తున్నాయి. ఆ తప్పులకే వివరణ ఇవ్వాలని అధికారులు ఓటర్లను ఆదేశిస్తున్నారు. దీనికి బదులుగా తెలుగునే ప్రామాణికంగా తీసుకుంటే పెద్ద సంఖ్యలో నోటీసులు ఇచ్చే భారం తప్పే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రంలో మాతృభాషను విస్మరించే విధంగా వ్యవహరించడం కూడా విమర్శలకు తావిస్తోంది. మరోవైపు క్షేత్ర స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఈ తరహా సాంకేతిక సమస్యలపైనే దృష్టి సారించాల్సి రావడంతో అసలైన ఓటు దొంగలు తప్పించుకునే అవకాశమూ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోటీసులు చూపించడమే తప్ప ఇవ్వడం లేదు
నోటీసులు ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా అనేకచోట్ల ప్రజలకు నోటీసులు ఇవ్వడం లేదు. సంబంధిత సిబ్బంది ఓటరుకు ఆ నోటీసును చూపించి, ఏ తేదిన అధికారుల ముందు హాజరుకావాలో చెప్పి, నోటీసు అందినట్లు సంతకాలు తీసుకుని వెళ్లిపోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే నోటీసులు ఇవ్వడానికి వీలు లేదని చెబుతున్నారని తెలిపారు. కొందరు ఫోటోలు తీసుకోవడానికి అంగీకరిస్తుండగా, మరికొందరు దానికి కూడా ఒప్పుకోవడం లేదు. నోటీసులు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా క్షేత్ర స్థాయిలో నోటీసులు చూపించడమే జరుగుతోందని స్పష్టమవుతోంది.
ఓటర్లను నేరస్తుల్లా చూడటం సరికాదు












