చిత్తూరు, 2026-06-05
ఆంధ్రప్రదేశ్ పట్టణ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల నాలుగో సవరణ బిల్లు-2026కు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద మార్పుగా పరిగణించబడుతోంది.
ఆంధ్రప్రదేశ్ పట్టణ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల నాలుగో సవరణ బిల్లు-2026కు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గతంలో 1986 నుంచి 2005 వరకు అమల్లో ఉండి, ఆ తర్వాత పరోక్ష పద్ధతిలోకి మారిన ఈ విధానాన్ని తిరిగి పునరుద్ధరించడం ద్వారా పట్టణ స్థానిక సంస్థల్లో నాయకత్వ స్థిరత్వాన్ని, జవాబుదారీతనాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గడువు ముగిసిన 87 మున్సిపాలిటీలు, మరో 13 త్వరలో ముగియనున్న పట్టణ స్థానిక సంస్థలతో కలిపి మొత్తం 100 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ కొత్త విధానంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
పార్టీ గుర్తు ద్వారానే ఎన్నికలు
ఈ చట్టసవరణ ద్వారా ఓటర్లు ఒకేసారి కౌన్సిలర్లతో, కార్పొరేటర్లతో పాటు తమ నగర, పట్టణ మేయర్ లేదా ఛైర్మన్‌ను పార్టీ గుర్తు ఆధారంగా నేరుగా ఎన్నుకుంటారు. ఇది కేవలం ఒక స్థానిక ఎన్నిక మాత్రమే కాదు, 2024లో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి రెండేళ్ల పాలనా తీరుపై ప్రజలు ఇచ్చే తొలి స్పష్టమైన తీర్పుగా మారబోతోందని భావిస్తున్నారు. క్యాంప్ రాజకీయాలు, ఫిరాయింపులకు కార్పొరేటర్ల బెదిరింపులకు అడ్డుకట్ట వేస్తూ నేరుగా ప్రజల మద్దతు ఉన్నవారే పీఠం ఎక్కేలా చేయడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. కౌన్సిలర్ల బలం తక్కువగా ఉన్నా, ప్రజాదరణ ఉన్న నాయకుడు మేయర్, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునే వెసులుబాటు ఈ నేరుగా ఎన్నికల విధానంలో లభిస్తుంది. దీనివల్ల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది.
కూటమి ధీమా, రాజకీయ వ్యూహాలు
రాజకీయ ప్రయోజనాల కోణంలో చూస్తే, ఈ నిర్ణయం వెనుక కూటమి ప్రభుత్వ ధీమా స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతి నిర్మాణం వేగం పుంజుకోవడం, విశాఖ పరిపాలనా ప్రాధాన్యత, ప్రధాన నగరాల్లో మౌలిక వసతుల కల్పన, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు పట్టణ ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయనే నమ్మకంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉంది. పొత్తులో భాగంగా స్థానాలను సజావుగా సర్దుబాటు చేసుకుని, ఒక్కో నగరంలో బలమైన మేయర్ అభ్యర్థిని నిలబెడితే, వైఎస్సార్సీపీని దెబ్బతీయడం సులువవుతుందని కూటమి వ్యూహకర్తలు భావిస్తున్నారు. నేరుగా మేయర్ పోస్టుకు పోటీ జరగడం వల్ల నగరాల్లో ప్రతిష్టాత్మక పోరు నెలకొని, ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది.
వైసీపీకి సవాలు, పరీక్ష
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది అత్యంత సవాలుతో కూడుకున్న సమయం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పట్టణ ప్రాంతాల్లో పార్టీ ఓటు బ్యాంక్ ఏమేరకు భద్రంగా ఉందో పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో నేరుగా పోటీకి సిద్ధమని, ఏకగ్రీవాలకు తావివ్వకూడదని కేడర్‌కు సూచిస్తున్నారు. అయితే, గతంలో వార్డు సభ్యులను కొనుగోలు చేసి పరోక్ష పద్ధతిలో ఛైర్మన్ పీఠాలు దక్కించుకునే సదుపాయం ఉండగా, ఇప్పుడు నేరుగా లక్షలాది మంది ఓటర్లను చేరుకుని మేయర్ స్థానాన్ని గెలుచుకోవడం ప్రతిపక్షానికి ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద పరీక్షే కానుంది.












