స్థానిక వేదం పాఠశాలలో గురుపౌర్ణిమ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయుడు భీమ సంజీవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ పూలమాల, శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదించే గురువులకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర దినమే గురుపౌర్ణిమ అని అన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని ప్రతి సంవత్సరం గురుపౌర్ణిమగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటామని, నాలుగు వేదాలను విభజించి మానవాళికి అందించిన ఆదికవి జగద్గురువు వేదవ్యాస మహర్షి జన్మదినం కావడంతో ఈ రోజును వ్యాసపౌర్ణిమగా కూడా పిలుస్తారని వివరించారు.
గు' అంటే అంధకారం, 'రు' అంటే దానిని తొలగించేవాడు అని అర్థమని పేర్కొంటూ, జీవితానికి సరైన మార్గాన్ని చూపి విజ్ఞాన వెలుగులు నింపే గురువులను దైవ స్వరూపంగా భావించి పూజించడం భారతీయ సంస్కృతిలోని గొప్ప సంప్రదాయమని తెలిపారు. ఈ పవిత్రమైన రోజున విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, తల్లిదండ్రులను స్మరించుకుని వారి ఆశీర్వాదాలు పొందాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం విద్యార్థులు గురుపౌర్ణిమ విశిష్టతను వివరిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







