హైదరాబాద్, 2024-08-02
గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న వీబీజీ రాంజీ ఉద్యోగుల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఎఫ్టీఈ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్నికల హామీ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న వీబీజీ రాంజీ ఉద్యోగుల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఎఫ్టీఈ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, వారికి న్యాయం చేస్తామని ప్రకటించిందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకుని గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన మార్పులతో వీబీజీ రాంజీ పథకంగా అమలు చేస్తోంది. ఈ పథకం గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో కొనసాగుతుండగా, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం చాలాకాలంగా కాంట్రాక్ట్, ఎఫ్టీఈ, ఔట్సోర్సింగ్ విధానాల్లోనే కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనుల నిర్వహణ, సాంకేతిక పర్యవేక్షణ, కంప్యూటర్ పనులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి బాధ్యతలను ఏపీఓలు, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న తమ సేవలను గుర్తించాలని కోరుతున్నారు.
సెర్ప్ ఉద్యోగులకు ఇచ్చిన తరహాలోనే న్యాయం చేయాలి
గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో మహిళా సంఘాలతో పనిచేసే సెర్ప్ ఉద్యోగుల్లో కొంతమందికి పే స్కేల్ అమలు చేసిన నేపథ్యంలో, వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
కొంతమంది ఉద్యోగులు రాత పరీక్షల ద్వారా ఎంపిక కాగా, మరికొందరు అర్హతలు, అనుభవం ఆధారంగా విధుల్లో చేరారు. ఇంకొందరు పదోన్నతులు పొందినా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగాల్సి వస్తోందని చెబుతున్నారు.
20 ఏళ్ల సేవకు భరోసా ఎప్పుడు
15 నుంచి 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఇప్పటికీ కనీస ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని చెబుతున్నారు.
ప్రభుత్వ పథకాల కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం.. కానీ మా జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












