** (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 26
అభ్యుదయ ఉద్యమాలకు, వామపక్ష భావాలకు ప్రభావితమై, కులాంతర వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచిన వల్లిపల్లి సుమతి ఆగస్టు 25న తుది శ్వాస విడిచారు. ఆమె చివరి వరకూ పార్టీ పట్ల బాధ్యతగా నడుచుకుంటూ, మరణానంతరం తన శరీరాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చి చైతన్యాన్ని ప్రదర్శించారు. ఆమె మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటుగా మిగిలింది.
సుమతిని అక్కా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునేవాళ్లం. ఆడపిల్లలకు అసలు చదువెందుకు అనే రోజుల్లోనే సాంకేతిక విద్యను అభ్యసించింది. అభ్యుదయ భావాలకు, వామపక్ష ఉద్యమాలకు ప్రభావితమై కులాంతర వివాహం చేసుకొని అందరికీ ఆదర్శనంగా నిలిచింది. ఐద్వా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజా ఉద్యమాల్లో పని చేస్తున్న నాయకులను, కార్యకర్తలను అప్యాయంగా అక్కున చేర్చుకుంది. అలాంటి ఆదర్శమూర్తి ఆగస్టు 25న మనల్ని విడిచి వెళ్లిపోయింది. చివరి వరకూ పార్టీ పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకుంది. తన శరీరాన్ని ప్రభుత్వ ఆసుపత్రికిచ్చి మరణంలోనూ చైతన్యాన్ని ప్రదర్శించింది. ఆమె మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.
వల్లిపల్లి సుమతి కృష్ణా జిల్లా కాటూరు గ్రామంలో పుట్టారు. తల్లి లక్ష్మీ తులసి, తండ్రి నాగభూషణం. అభ్యుదయ భావాలు కలిగిన కుటుంబం వీరిది. అంతేకాదు ఆమె పుట్టిన కాటూరు అభ్యుదయ భావాలకు, మహిళా ఉద్యమానికి పుట్టినిల్లు. మానికొండ సూర్యావతి, రాజేశ్వరమ్మ, కడియాల బుల్లెమ్మ నాయకత్వంలో అప్పట్లో మహిళా ఉద్యమం నడిచేది. మూఢనమ్మకాలకు, ఛాందస భావాలకు వ్యతిరేకంగా మహిళల్లో, యువతలో పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారు. అలాగే స్ర్తీ విద్య, వితంతు పునర్వివాహాలు, కులం మతం పట్టింపులు లేని సమాజం కోసం అనేక ఉద్యమాలు అక్కడి నుండే జరిగేవి. అలాంటి చోట పుట్టి పెరగడం వల్ల సుమతిపై కూడా ఆ ప్రభావం పడింది.
సుమతి వాళ్లు ముగ్గురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. ఆర్థికంగా అంతంత మాత్రమే. అయినప్పటికీ నాగభూషణం దంపతులు తమ పిల్లలను బాగా చదివించారు. ఆరోజుల్లో ఆడపిల్లలకు చదువెందుకు అని అందరూ అనుకునేవారు. కానీ ఆయన తన ముగ్గురు ఆడపిల్లల్ని సాంకేతిక విద్యలో ప్రోత్సహించారు. అంతేకాదు గ్రామంలోని మిగతా ఆడపిల్లలను కూడా చదివించమంటూ తల్లిదండ్రులను ప్రోత్సహించేవారు. ఇంట్లో సుమతినే పెద్ద కూతురు. ఆమె సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించింది. పి.మధును కులాంతర వివాహం చేసుకుంది. అప్పటికే మధు పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా ఉన్నారు. తన చెల్లెళ్లను చదివించడంతో పాటు వాళ్లు కూడా కులాంతర వివాహాలు చేసుకునేలా ప్రోత్సహించిన ఆదర్శ మూర్తి సుమతి. భర్త మధు పార్టీ పనుల్లో విరామం లేకుండా తిరుగుతుంటే ఉద్యోగం చేసుకుంటూనే ఆమే కుటుంబాన్ని చూసుకునేది. అంతేకాదు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు ఇంటికి వచ్చినా అందరికీ అన్నీ చేసి పెట్టేవారు. ఎంతో ప్రేమగా వారినీ తన కుటుంబ సభ్యులుగా ఆదరించేది. అలాగే సైన్స్ ఉద్యమం (జె.వి.వి.) లో కూడా కీలక పాత్ర పోషించింది. కూతురు ప్రతిభకు పదేండ్లు వున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నైట్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ (డిగ్రీ) సీటు వచ్చింది. కానీ పాప చదువుకోసం దాన్ని విరమించుకుంది.
కూతురు ప్రతిభ ఈరోజు డాక్టర్ అయ్యిందంటే అందులో సుమతి కృషి చాలా ఉంది. అంతేకాదు ఈ రోజు పి.మధు పార్టీలో ఓ నాయకుడిగా ఎదిగాడంటే అందులో ఆమె పాత్ర చాలా కీలకం. తర్వాత ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకొని మహిళా ఉద్యమంలోకి వచ్చింది. అలాగే ప్రజాశక్తిలో కొన్ని రోజులు అనువాదకురాలిగా చేసింది. బుక్హౌస్లో ఉంటూ అనేక పుస్తకాలను అనువదించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఐద్వా అభివృద్ధికి తన వంతు కృషి చేసింది. 2001లో ఐద్వా అఖిల భారత 7వ మహాసభలు విశాఖపట్నంలో జరిగాయి. అప్పడు ఓ సావనీర్ తీసుకొచ్చాం. ఆ సావనీర్ పనులన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంది. వ్యాసాలు తెప్పించడం, తప్పులు లేకుండా చూడడం, ఫ్రీగా ప్రింటింగ్ వేయించడం ఇలా అన్నీ పనులూ ఆమె చూసుకుంది.












