హైదరాబాద్, జులై 10
కర్ణాటకలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తుంగభద్ర నదికి వరద నీరు చేరడం ప్రారంభమైంది. దీంతో తుంగభద్ర డ్యామ్‌లో జలకళ కనిపిస్తున్నా, తెలుగు రాష్ట్రాల జీవనాడి అయిన శ్రీశైలం జలాశయం మాత్రం నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి.
కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నదికి ఆశాజనకంగా వరద నీరు చేరడం ప్రారంభమైంది. ఆలస్యంగానైనా వరద చేరికతో తుంగభద్ర డ్యామ్‌లో జలకళ కనిపిస్తోంది. అయితే, తెలుగు రాష్ట్రాలకు జీవనాడి అయిన శ్రీశైలం జలాశయం మాత్రం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉండగా, ఈ ఏడాది నీటి చుక్క జాడ కూడా కనిపించడం లేదు. కృష్ణా నది పరవళ్లు తొక్కి, శ్రీశైలం గేట్లు ఎత్తే అద్భుత ఘట్టం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
రాయలసీమ జిల్లాలకు ప్రాణాధారమైన తుంగభద్ర జలాశయానికి శుక్రవారం (జులై 10) ఉదయానికి 40వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డ్యాం గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1596.34 అడుగులుగా ఉంది. డ్యాం పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.155 టీఎంసీల వరద చేరింది. ఎగువన తుంగ డ్యాంకు వరద పోటెత్తడంతో 22 గేట్లు ఎత్తి 26,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో తుంగభద్ర జలాశయానికి సగటున 44,315 క్యూసెక్కుల వరద చేరుతుందని టీబీపీ బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 1,624.81 అడుగుల నీటి మట్టంతో 75.934 టీఎంసీలు చేరడమే కాకుండా, 52,423 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండడంతో గేట్లు ఎత్తేసి 61.145 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది మాత్రం వరద ప్రవాహం ఆలస్యంగా ప్రారంభమైంది.
తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన శ్రీశైలం జలాశయానికి నీటి జాడ కనిపించడం లేదు. గత ఏడాది జూలై 8న సీఎం చంద్రబాబు శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కనుచూపు మేరలో కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 821.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, 42.0197 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది.












