America, July 30, 2026
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితి ఆత్రగాడికి బుద్ధి మట్టు అన్న నానుడిని తలపిస్తోంది. ఇరాన్‌పై దాడులు, మధ్యంతర ఎన్నికల ఒత్తిడి, మిత్రదేశాల నుంచి మద్దతు లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న ట్రంప్, ఇప్పుడు ప్రపంచ దేశాల ఉత్పత్తులపై సుంకాల యుద్ధాన్ని ప్రకటించారు. ఇది అమెరికా ఆధిపత్యానికి సవాల్‌గా మారడంతో పాటు, అనేక దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది.
ఆత్రగాడికి బుద్ది మట్టు అన్నది ఒక లోకోక్తి. ప్రస్తుతం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి అలానే ఉంది. ఒక వైపు ఇరాన్‌పై దాడులకు దిగి దాన్ని లొంగదీసుకోలేక హార్ముజ్ జలసంధి నుంచి బయటపడలేక గిలగిలా కొట్టుకుంటున్నాడు. నాటోలోని ఐరోపా, ఆసియా, ఇతర ఖండాల్లోని మిత్రదేశాలేవీ అమెరికాను ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు. వాటి వైఖరిని మింగా కక్కలేక ఉన్నాడు.
ఒక వైపు నవంబరు మూడున పార్లమెంటు మధ్యంతర ఎన్నికల గడువు సమీపిస్తున్నది. తన నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోతే 2028వరకు ప్రతిదానికీ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ మద్దతు మీద ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు టెహరాన్ నేతలను బెదిరిస్తూ ఏదో విధంగా రాజీకి రండిరా బాబూ అన్నట్లుగా సంకేతాలు పంపుతున్నాడు. అయినా ఇరాన్ తమ షరతులపై తగ్గేదేలే అన్నట్లుగా ఉంది.
ఇటువంటి స్థితిలో బస్తీమే సవాల్ అన్నట్లుగా మిత్ర, శత్రుదేశాలనే తేడా లేకుండా వాటి ఉత్పత్తుల దిగుమతుల మీద సుంకాల యుద్ధాన్ని ప్రకటించాడు. అమెరికా ఆధిపత్యం చెల్లదు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా అది ఎంత శాతం పన్ను విధిస్తే అంత మొత్తాన్ని తామూ వసూలు చేస్తామని అన్ని దేశాలూ హెచ్చరిస్తున్నాయి. ఆయా దేశాలు బలవంతంగా శ్రమ చేయిస్తూ మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున అపరాధ సుంకాలు విధిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ట్రంప్ ప్రకటించాడు.
బలవంతంగా పని చేయిస్తున్న దేశాల నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత లేదా పన్నుల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప్‌నకు రాజకీయంగా ఆ దేశాలను దెబ్బతీసేందుకు అదొక సాకు తప్ప మరొకటి కాదు. అమెరికా లేదా ట్రంప్ వైఖరిని చూస్తే గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదన్నది స్పష్టం. తొలిసారి పదవిలో ఉండగా 2018లో ట్రంప్ యంత్రాంగం ప్రారంభించిన వాణిజ్య పోరులో అనేక ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కు తగ్గటం లేదు.
సెనెట్ సభ్యుల ప్రతిపాదిత బిల్లు గనుక చట్ట రూపం దాల్చితే రష్యాతో చమురు, ఇతర వాణిజ్య లావాదేవీలు జరిపే మనదేశం, చైనా, మరికొన్ని దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టటం అనివార్యం. వంద శాతం అపరాధ సుంకాలు విధించేందుకు అవకాశం ఉంది. రష్యాను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టేందుకు దాని చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌తో ఒకవైపు దాడులు చేయిస్తూ మరోవైపు ఆంక్షలను కఠినతరం కావిస్తున్నది. చమురు కొనుగోలు చేసే దేశాలనే కాదు, రవాణా చేసే నౌకలపై కత్తి ఝుళిపించేందుకు చూస్తున్నది. ప్రస్తుతం ఈజిప్టు నుంచి సింగపూర్ వరకు సముద్రంలో 13.7 కోట్ల పీపాల ముడి చమురుతో నౌకలు ఎటుపోవాలో తెలియక తిష్టవేసి ఉన్నాయి.
హార్ముజ్ జలసంధి దిగ్బంధన సమయంలో అలాంటి రష్యా చమురును కొనుగోలు చేయవచ్చంటూ ట్రంప్ గతంలో తొలగించిన ఆంక్షల గడువు ముగిసింది. హార్ముజ్‌తో పాటు ఎర్ర సముద్రం-అరేబియా సముద్రాలను కలిపే బాబ్ ఎల్ మండాబ్ జలసంధి కూడా దిగ్భంధనంలోకి వస్తే మరోసారి ఆంక్షలను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి రావచ్చు.












