ఖానాపూర్, జూలై 25
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ పట్టణం, పరిసర మండలాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి అనంతరం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, మహాదేవుని ఆలయం, వీరాంజనేయ స్వామి ఆలయం, జంగల్ హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదేవిధంగా మండలంలోని దిలావర్పూర్, రంగపేట్, మస్కాపూర్, సుర్జాపూర్, గంగాయిపేట్ గ్రామాల్లోని శివ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
తొలి ఏకాదశి (శయన ఏకాదశి) అత్యంత పవిత్రమైనదిగా భావించే భక్తులు ఉపవాస దీక్షలు పాటించి, పండ్లు, ఫలహారాలతో వ్రతాన్ని ఆచరించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశితో చతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయని, ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాల్లో పేర్కొనబడిందని అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో శ్రీకృష్ణుడు, గోదాదేవి, లక్ష్మీదేవికి అష్టోత్తర పూజలు, తులసి పూజ, పుష్పార్చనలు, సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో ప్రధాన అర్చకులు నరసింహస్వామి మూర్తి, సందీప్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ అడ్డగట్ల రాజన్న, కార్యవర్గ సభ్యులు వెన్నం అంజయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.











