నిర్మల్, 25 July
నిర్మల్ జిల్లా లోకేశ్వరము మండలం బాగాపూర్ శివారులోని రాజ్యలక్ష్మి సహితా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తొలి ఏకాదశి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరము మండలం బాగాపూర్ శివారులో గల రాజ్యలక్ష్మి సహితా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచోపనిషత్తులతో, పంచామృతాలతో అభిషేక పూజ గావించారు. స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో సహస్ర తులసీదళార్చన, పువ్వులతో అష్టోత్తర పూజ నిర్వహించారు.
ఆలయ అర్చకులు నరసింహస్వామి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీర సాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారని, అయితే యోగ నిద్రలో ఉన్నా భక్తుల యోగక్షేమాలను చూస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లిన స్వామి, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని, ఈ కాలాన్ని చాతుర్మాస దీక్ష అంటారని వివరించారు.
ఈ రోజు నుంచే రాత్రి సమయం ఎక్కువగా ఉండే దక్షిణాయనం మొదలవుతుందని, దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రి అని, మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక్కరోజు అని తెలిపారు. తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ స్వామిని పూజించడం, దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కోరికలు నెరవేరుతాయని అర్చకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాగాపూర్, రాజురా, మన్మద్, పోటీపెల్లి, నగర్, పిప్రి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.











