తెలంగాణ రాజకీయాల్లో ఆధ్యాత్మికత, రాజకీయ వ్యూహాల మధ్య సంబంధంపై కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శైవ సంప్రదాయానికి ప్రాధాన్యత పెరుగుతోందని, ఇది రాహుల్ గాంధీ నూతన రాజకీయ సిద్ధాంతంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో కేసీఆర్ హయాంలో వైష్ణవ భక్తి, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రధానంగా కనిపించాయి. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, కొండగట్టు అంజన్న ఆలయాలపై దృష్టి సారించడం ద్వారా శైవానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
రాహుల్ గాంధీ ఇటీవల తనను తాను శివ భక్తుడిగా అభివర్ణించుకుంటూ, శైవంలోని వైరాగ్యాన్ని, కరుణను ప్రశంసిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే మార్గంలో పయనిస్తూ, సామాన్య ప్రజలకు చేరువలో ఉండే శైవ క్షేత్రాలను అభివృద్ధి చేయడం ద్వారా రాహుల్ గాంధీ సామాజిక ఇంజనీరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు భావించవచ్చు.
శైవ క్షేత్రాలను ప్రోత్సహించడం ద్వారా అట్టడుగు వర్గాలకు చేరువ కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్ వైష్ణవ భక్తిని అగ్రవర్ణాల ప్రాబల్యంగా చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వేములవాడ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించడం ద్వారా ఉత్తర తెలంగాణ సెంటిమెంట్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












