హైదరాబాద్, 2026-06-05
తెలంగాణలో సామాజిక న్యాయం కనుమరుగైందని, బీసీ, బహుజనుల పట్ల వివక్ష కొనసాగుతోందని మన ఆలోచన సాధన సమితి అధికార ప్రతినిధి మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ వివక్ష కొనసాగుతోందని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే సామాజిక న్యాయం కనుమరుగైందని స్పష్టమవుతోందని మన ఆలోచన సాధన సమితి అధికార ప్రతినిధి మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది బీసీ, బహుజనుల ఆత్మత్యాగాలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీ, బహుజనుల పట్ల వివక్ష కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.
త్యాగాలు బీసీలవి, బోగాలు ఓసీలవి అన్నట్లుగా పాలన
వ్యవస్థలను మార్చుకుని, 90 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగా, తాయిలాలు స్వీకరించేవారిగా చిన్నచూపు చూస్తున్నారని శంకర్ గంగపుత్ర విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలకు ఊడిగం చేస్తున్నప్పటికీ, అవినీతి, అక్రమాలతో డబ్బు, పలుకుబడి సంపాదించిన ఓసీలకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, జడ్పీ, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్లకు చైర్మన్లుగా, నామినేటెడ్ పదవులలో కూడా కులతత్వాన్ని ప్రదర్శిస్తూ, రెడ్డి ప్రభుత్వంలో ఉంటే రెడ్డీలకు, వెలమ ప్రభుత్వంలో ఉంటే వెలమలకు పదవులను పంచుతూ, ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ, బీసీ, బహుజనులను రాజకీయంగా, సామాజికంగా ఎదగకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ నిర్ణయాల్లో రెడ్డిల పేర్లకే ప్రాధాన్యత
చివరకు, రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, నామినేటెడ్ పదవుల్లోనే కాకుండా, విశ్వవిద్యాలయాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, ఫ్లైఓవర్లకు, ప్రభుత్వ రంగ సంస్థలకు పేర్లు పెట్టే విషయంలోనూ, రాష్ట్రంలో బీసీ, బహుజనులలో మహనీయులే లేరన్నట్లు కేవలం రెడ్డిల పేర్లనే పెడుతూ కులతత్వాన్ని చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇటీవలి కాలంలో రెడ్డిల అరాచకం మరింత పెరిగిపోతోందని, తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందోననే భయంతో, అధికార మదంతో, కులాధిపత్య ధోరణిని అవలంబిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజకీయ నాయకులను తీవ్రంగా దూషిస్తూ, దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు.
అధికార, విపక్షాల్లో రెడ్డీల ఏకత్వం
ఇంకా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ, తిడితే మేమే తిట్టాలి, తిట్టుకుంటే మేమే తిట్టుకుంటాము, విమర్శించుకుంటే మేమే విమర్శించుకుంటాము అనే విధంగా ప్రభుత్వం గానీ, పార్టీ గానీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా, అధికార, విపక్ష పార్టీలలో ఉన్న రెడ్డీలు తామంతా ఒక్కటే అన్నట్లు వ్యవహరిస్తున్నారని శంకర్ గంగపుత్ర విమర్శించారు. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులు ఏదైనా మాట్లాడితే వెంటనే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఏకమై ప్రెస్ మీట్లు పెట్టి మరీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహరిస్తూ రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు.











