బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 22
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన, సాంఘిక, దివ్యాంగుల సంక్షేమ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే పలు కీలక అంశాలపై అధికారులను ప్రశ్నించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఆయన సమీక్షించారు.
అధికారులపై ఎమ్మెల్యే మండిపాటు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి దివ్యాంగులకు సైకిళ్లు అందజేసే కార్యక్రమానికి హాజరైనప్పటికీ, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు కనీస సమాచారం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు.
గిరిజనుల సమస్యలపై దృష్టి
వందల ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులను కొత్తగా తీసుకొచ్చిన చట్టాల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని అన్నారు. అటవీ అధికారులు గిరిజనులను వేధించడం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వారికి ప్రభుత్వం మరింత సహకరించాలని, అవసరమైన చోట పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పిల్లలకు మెరుగైన విద్య అందించడం అత్యంత ముఖ్యమని, విద్యే వారి భవిష్యత్తును నిర్మిస్తుందని అన్నారు.
సంస్థల పునరుద్ధరణకు డిమాండ్
గతంలో గిరిజనులతో కళకళలాడిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ప్రస్తుతం కనీసం కార్యాలయాల గేట్ల వద్దకు కూడా ప్రజలు రాని పరిస్థితికి చేరుకున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి తగిన నిధులు కేటాయించి, అవసరమైన అధికారాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
సమావేశంలో పాల్గొన్నవారు
సమీక్ష సమావేశంలో గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.











