Mahabubnagar/Addakal (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నేతల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో, పలువురు నేతలు ఈ పదవిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా, మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు, ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ ఈ రేసులో ముందున్నారు.
శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో, ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీకి చేసిన సేవలను వివరిస్తూ, తెలంగాణ పీసీసీ, ఏఐసీసీ నేతలతో ఉన్న పరిచయాల ద్వారా లాబీయింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ పదవిలో ఒకసారి పనిచేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మరోసారి ఆ పదవిని రెన్యువల్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, సీనియర్ కాంగ్రెస్ నేత, ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు ఆసంపల్లి శ్రీనివాస్, సుడా చైర్మన్ పదవిపై కన్నేశారు. ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఒకసారి సుడా చైర్మన్‌గా పనిచేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి తిరిగి పదవి కట్టబెట్టవద్దని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొత్తవారికి అవకాశం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్, శ్రీధర్ బాబు అనుచరుడే కాకుండా, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు సన్నిహితుడిగా కాంగ్రెస్ శ్రేణుల్లో సుపరిచితుడు. ఈ కారణంగా కరీంనగర్ నివాసి అయిన ఆసంపల్లి శ్రీనివాస్‌కు సుడా చైర్మన్ పదవి దక్కుతుందని అతని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆసంపల్లి శ్రీనివాస్‌కు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
గత పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికీ, వివిధ సామాజిక సమీకరణల కారణంగా శ్రీనివాస్‌కు ఆ అవకాశం దక్కలేదు. సీనియర్ వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, సైక్లింగ్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా, తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవాధ్యక్షులుగా ఆసంపల్లి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
ఆసంపల్లి శ్రీనివాస్‌కు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. అందరి ఆశీస్సులతో తనకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆసంపల్లి శ్రీనివాస్ ధీమాతో ఉన్నారు.










