ఫలితాల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఒక ఇంటర్ విద్యార్థి బోర్డు అధికారులకు ఫోన్ చేసి సహాయం కోరిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విద్యార్థి ఆందోళనను గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి, ఫోన్లోనే కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు.
విశాఖకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఒకరు ఫలితాలకు ముందు బోర్డు అధికారులకు ఫోన్ చేసి, తాను పరీక్షల్లో సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భయంతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు వివరించాడు.
విద్యార్థి పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు అతనికి ఫోన్లోనే కౌన్సెలింగ్ ఇచ్చారు. కంగారు పడాల్సిన అవసరం లేదని, రాబోయే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు బాగా సిద్ధమవ్వాలని సూచించారు.
ఈ విషయాన్ని సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థి ఐదు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తేలింది.
ప్రస్తుతం విద్యార్థి ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడని, భవిష్యత్తులో బాగా చదివేలా చూసుకుంటామని అతని తల్లిదండ్రులు అధికారులకు హామీ ఇచ్చారు.








