ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు గుడిపాటి కోటయ్య యాదవ్ అన్నారు. మిర్యాలగూడ మండలం జప్తి వీరప్ప గూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య నారాయణరెడ్డి (సినారె) 95వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గుడిపాటి కోటయ్య యాదవ్ మాట్లాడుతూ సినారే తన రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. యువకులకు, యువ సాహితీవేత్తలకు వారు రాసిన 'ఆధునికాంధ్ర కవిత్వం - సాంప్రదాయాలు - ప్రయోగాలు' అన్న సిద్ధాంత గ్రంథం నేటికీ ప్రామాణికంగా ఉండటమే వారి ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎడవల్లి దామోదర్ రెడ్డి, పి జగదీశ్వర్ రెడ్డి, ఒట్టె మాధవి, టి శ్రీనివాసరెడ్డి, జల్ రామ్, చంద్రకళ, రేణుక తదితరులు పాల్గొన్నారు.












