కరీంనగర్, 2026-06-05
డా. నలిమెల భాస్కర్ రచించిన శిరసెత్తిన శిఖరాలు అమ్మా బాపుల జీవన చిత్రణ పుస్తకం కేవలం తల్లిదండ్రుల స్మృతిగ్రంథం మాత్రమే కాదు, తెలంగాణ పల్లె జీవన విధానానికి, కుటుంబ విలువలకు, మానవీయ సంబంధాలకు అక్షరరూపంలో నిర్మించిన శాశ్వత స్మారకం. ఈ గ్రంథం జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకోవడం నేర్పిస్తుందని సాహిత్య విమర్శకులు డా. పెరుక రాజు అభిప్రాయపడ్డారు.
కొన్ని పుస్తకాలు చదివి మూసివేస్తాం. కొన్ని మనసును కదిలిస్తాయి. మరికొన్ని జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకోవడం నేర్పిస్తాయి. డా. నలిమెల భాస్కర్ రచించిన శిరసెత్తిన శిఖరాలు అమ్మా బాపుల జీవన చిత్రణ అలాంటి అరుదైన గ్రంథం. ఇది కేవలం రచయిత తన తల్లిదండ్రులకు సమర్పించిన స్మృతిగ్రంథం మాత్రమే కాదు, తెలంగాణ పల్లె జీవన విధానానికి, కుటుంబ విలువలకు, ఉపాధ్యాయ ధర్మానికి, ప్రకృతి ప్రేమకు, మానవీయ సంబంధాలకు, నిజాయితీకి అక్షరరూపంలో నిర్మించిన శాశ్వత స్మారకం.
గ్రంథ పరిచయం
ఆషాఢం2026లో సాహితీ సోపతి తెలంగాణ ప్రచురించిన 112 పేజీల ఈ గ్రంథం పరిమాణంలో చిన్నదైనా, భావగర్భితంలో మహత్తరమైనది. ప్రతి అధ్యాయం ఒక జ్ఞాపకం మాత్రమే కాదుఒక జీవన పాఠం. ప్రతి సంఘటన ఒక కుటుంబ చరిత్ర మాత్రమే కాదు, ఒక తరం జీవించిన విలువలకు సజీవ సాక్ష్యం.
రచయిత పరిచయం
1956లో నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, నారాయణపురంలో శ్రీ రామచంద్రం శ్రీమతి బుచ్చమ్మ దంపతులకు జన్మించిన డా. నలిమెల భాస్కర్ బహుభాషావేత్త, పరిశోధకుడు, అనువాదకుడు, విశ్రాంత డిగ్రీపీజీ కళాశాల ఉపన్యాసకుడు. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సాధించి, నలభై ఐదుకు పైగా గ్రంథాలను, వాటిలో పదిహేను అనువాద గ్రంథాలను తెలుగు పాఠకులకు అందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ పురస్కారం సహా అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆయన సాహిత్య సేవకు లభించాయి. తన తల్లిదండ్రుల పేరుతో సాహితీ పురస్కారాన్ని ప్రారంభించడం ఆయన కృతజ్ఞతాభావానికి నిలువెత్తు నిదర్శనం.
మాతృమూర్తి బుచ్చమ్మ
ఈ గ్రంథంలోని హృదయం బుచ్చమ్మ. ఆమె ఒక తల్లి మాత్రమే కాదు, కుటుంబాన్ని తన శ్రమతో, ప్రేమతో, క్రమశిక్షణతో నిలబెట్టిన జీవనశిల్పి. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి, ముఖంపై చల్లని నీళ్లు చల్లి, భాస్కర్ లేవురా పాశి నోటితో చదివితే పాఠాలు మనసులో బాగా నిలుస్తాయి అని తన కుమారుడిని ప్రేమగా నిద్రలేపే తల్లి రూపం పాఠకుడి కళ్లముందు సజీవంగా నిలుస్తుంది. ఆ తర్వాత ఇంటి పనులను ప్రారంభిస్తూ, ప్రతి పాత్రను పరిశుభ్రంగా ఉంచడం, కుటుంబ సభ్యుల అభిరుచికి తగ్గట్టుగా రుచికరమైన వంటలు చేయడం, ఇంటిని ఆప్యాయతతో నింపడంఇవన్నీ ఆమె వ్యక్తిత్వంలోని క్రమశిక్షణ, శ్రమ, మమకారాన్ని తెలియజేస్తాయి. తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె పడిన కష్టం, చేసిన త్యాగం, అనుభవించిన నిశ్శబ్ద పోరాటం ఈ గ్రంథంలో అత్యంత హృద్యమైన అధ్యాయంగా నిలుస్తుంది. బుచ్చమ్మ జీవితం ఒక తల్లి ప్రేమకు మాత్రమే కాదు, కుటుంబాన్ని విలువలతో తీర్చిదిద్దిన మాతృశక్తికి చిరస్మరణీయ నిదర్శనం.










