దేశ స్వాతంత్ర్యం అనంతరం స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన తెగువ అమోఘమైనదని శాతవాహన యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్. సుజాత అన్నారు.
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం నిర్వహించిన "ఐరన్ మ్యాన్స్ విజనరీ లీడర్ షిప్ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత జాతిని జాగృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక భూమిక పోషించారని ఆమె పేర్కొన్నారు.
విద్యార్థులు దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని తమ మూలాలను మరిచిపోకుండా జీవితంలో ఎదగాలని ప్రొఫెసర్ సుజాత సూచించారు. తెలంగాణ సంస్కృతి గొప్పదని ప్రశంసిస్తూ, రాజకీయాలు చూసే కోణాన్ని బట్టి మారతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి జాతీయ సదస్సులు ఈ ప్రాంతంలో జరగడం శుభసూచకమని అన్నారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ సదస్సు విజయవంతమైందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జైకిషన్ ఓజా తెలిపారు. సుమారు 50 పరిశోధన పత్రాలు సమర్పించబడ్డాయని, భవిష్యత్తులోనూ ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. సదస్సులో సెమినార్ కన్వీనర్ డాక్టర్ కె. రాజయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేందర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


