దేశ సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన యువత కోసం భారత నావికా దళంలో అగ్నివీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తులు లేకుండానే నేరుగా రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ - 2026 కింద ఈ నియామకాలు జరగనున్నాయి. ఈ ర్యాలీలో పాల్గొనేవారు తమ విద్యార్హత, ధృవీకరణ పత్రాల ఒరిజినల్ కాపీలతో పాటు, ఆరు సెట్ల జిరాక్స్ కాపీలు, పది పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.
మహిళా అభ్యర్థుల కోసం ఎంపిక ప్రక్రియ మార్చి 9న, పురుష అభ్యర్థుల కోసం మార్చి 15న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో గల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా యువత దేశ రక్షణ రంగంలో తమ సేవలను అందించే అవకాశం లభిస్తుంది.
అభ్యర్థులు నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతల కోసం అధికారిక వెబ్సైట్ https://agnipathpayu.cdac.in ను సందర్శించవచ్చు. జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


