ఇచ్చోడ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో 45వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేష ఆకర్షణగా నిలిచాయి.
రాష్ట్ర అధ్యాపక సంఘం అధ్యక్షుడు బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పాఠశాలలో నైతిక విలువలు, దేశభక్తి, సదాచారం వంటి లక్షణాలను విద్యార్థులలో పెంపొందించడం జరుగుతోందని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవం వంటి అంశాలపై ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పేర్కొన్నారు.
వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు యోగ, చెక్కభజన, కోలాటం, పిరమిడ్స్, నృత్యాలు, ఏకపాత్రాభినయాలు, నాటికలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
కార్యక్రమంలో విభాగ్ అధ్యక్షుడు భజరంగ్ లాల్ అగర్వాల్, విభాగ్ కార్యదర్శి సరుకొండ దామోదర్, శైక్షణిక్ ప్రముఖ్ వేణుమాధవ్, పాఠశాల కమిటీ సభ్యులు, పూర్వ ప్రధానాచార్యులు, పోషకులు, ఆచార్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












