దేశవ్యాప్తంగా నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
దేశంలో శుక్రవారం ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు అమల్లోకి వచ్చాయి. నిర్మల్ జిల్లాలో లీటర్ పెట్రోల్‌పై రూ.3.42, డీజిల్‌పై రూ.3.42 పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.110.88కు, డీజిల్ ధర రూ.98.96కి చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడమే దీనికి కారణమని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి.
ఈ ధరల పెరుగుదల రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. బస్సులు, లారీలు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీల ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల అన్ని రంగాలపై ఈ ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలతో పాటు, కూరగాయలు, పాలు, పెరుగు, నిత్యావసరాల ధరలు కూడా పెరిగే సూచనలున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వ్యవసాయ రంగంపై కూడా డీజిల్ ధరల పెరుగుదల అదనపు భారాన్ని మోపనుంది. ట్రాక్టర్లు, మోటార్లు, పంపుసెట్లు, వ్యవసాయ పరికరాల వినియోగ ఖర్చులు పెరగనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చులు పెరగడం వల్ల మార్కెట్లో ధాన్యం, కూరగాయలు, పండ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచి, సామాన్య ప్రజల జీవన వ్యయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ యాప్‌లు కూడా లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో డెలివరీ ఛార్జీలను పెంచే అవకాశాలున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం, కనీస ఆర్డర్ విలువ పెరగడం, డిస్కౌంట్లు తగ్గించడం వంటి మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ తాజా పెరుగుదల మరింత భారంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.








