ప్రజావాణి ద్వారా ప్రజల నుండి అందే వినతులను ఏమాత్రం జాప్యం చేయకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, విద్యా వారోత్సవాల్లో అధికారులు చురుకుగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వినతులపై అధికారులు సానుకూల దృక్పథంతో స్పందించాలని, మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ప్రజావాణిలో విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. అధికారులు, సిబ్బంది కార్యాలయ సమయాలను పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.
‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రారంభమవుతున్న విద్యా వారోత్సవాల్లో మండల ప్రత్యేక అధికారులు చురుకుగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. మే 15న నిర్వహించనున్న ‘లైబ్రరీ డే’ సందర్భంగా అధికారులు పెద్ద ఎత్తున పుస్తకాలను వితరణ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












