పెద్దపల్లి, జులై 30
పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా మంథని మండల కేంద్రంలోని బొక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నీరు పంట పొలాల్లోకి చేరితే మట్టి పేరుకుపోయి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముత్తారం మండలం ఓడేడు నుండి భూపాలపల్లి జిల్లాలోని గ్రామాలకు వెళ్లేందుకు వేసిన మట్టి రోడ్డు వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. దీంతో గరిమెళ్ళపల్లి, ఎంచపెల్లి, టేకుమట్ల గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, మంథని మండలం విరోచవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మించిన చెక్ డ్యామ్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని హుస్సేన్ మియా వాగులోకి మానేరు నీటితో పాటు, పంట పొలాల్లోని నీరు చేరడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ కారణంగా గోదావరిఖని, మంథని, ముత్తారం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.












