నిజామాబాద్, 2026-08-26
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని రాగి తీగలు, నూనె దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ముగ్పాల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా రాగి తీగలు, దొంగతనాలకు ఉపయోగించిన వాహనాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నిజామాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని రాగి తీగలు, నూనె దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ముగ్పాల్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్పాల్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నిజామాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో జరిగిన పలు ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.
వాహన తనిఖీల్లో పట్టుబడిన ముఠా
ఆగస్టు 25న ఉదయం 10.30 గంటల సమయంలో కంజర్ గ్రామ శివారులో ముగ్పాల్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా, ట్రాన్స్ఫార్మర్ రాగి తీగల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు.
నిందితుల వివరాలు
అరెస్టు అయిన వారిలో కడారి రవీందర్ (36, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా), బంగారు కళ్ల మహేష్ అలియాస్ బబ్లూ (23, ఇందిరాపూర్ కాలనీ, నిజామాబాద్), అగుల్ల రాజేష్ (26, గొల్లపల్లి, సాయినగర్, నిజామాబాద్), మందా దీపక్ అలియాస్ సోనూ (26, ఇందిరాపూర్ కాలనీ, నిజామాబాద్), అడవు ఆకాశ్ (23, ఇందిరాపురి కాలనీ, నిజామాబాద్), సనం చంద్రకాంత్ (22, నాగారంసిద్ధార్థనగర్, నిజామాబాద్‌లకు చెందినవారుగా గుర్తించారు.
పగటిపూట రెక్కీ.. రాత్రివేళల్లో దొంగతనాలు
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితులు ఒక ముఠాగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి రెక్కీ నిర్వహించేవారని తెలిపారు. రాత్రివేళల్లో వాహనాల్లో అక్కడికి చేరుకుని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని రాగి తీగలు, రాగి కాయిల్స్‌తో పాటు ట్రాన్స్ఫార్మర్ నూనెను దొంగిలించేవారని పేర్కొన్నారు. దొంగిలించిన రాగి తీగలను ప్రధానంగా కడారి రవీందర్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారికి విక్రయించినట్లు, కొన్ని సందర్భాల్లో కరీంనగర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా విక్రయించినట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.
పలు ప్రాంతాల్లో దొంగతనాలు
ఈ ముఠా ముగ్పాల్, మాక్లూర్, డిచ్పల్లి, నవీపేట్, వర్ని, నిజామాబాద్ గ్రామీణ, భీంగల్, జక్రాన్‌పల్లి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో పలు ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆయా కేసుల వివరాలను సంబంధిత పోలీసు స్టేషన్లతో సమన్వయం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


