నిర్మల్, 20 జూలై, 2026
విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు అందకపోవడంపై PDSU తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు సకాలంలో రెండు జతల యూనిఫాంలు అందించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని PDSU జిల్లా అధ్యక్షులు సింగరి వెంకటేష్ హెచ్చరించారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై నెల దాటినా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు అందకపోవడం పట్ల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే రెండు జతల యూనిఫాంలు అందించాలని PDSU జిల్లా అధ్యక్షులు సింగరి వెంకటేష్ డిమాండ్ చేశారు.
ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో కస్బ పాఠశాల విద్యార్థులతో మాట్లాడిన సింగరి వెంకటేష్, జూన్ నెలలోనే పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, నేటికీ విద్యార్థులకు కనీసం ఒక జత యూనిఫాం కూడా సరిగ్గా అందకపోవడం దారుణమని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని, సకాలంలో యూనిఫాంలు అందించకపోవడంతో పాత బట్టలతోనో, రంగు దుస్తులతోనో పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిన అధికారులు, ఇప్పటివరకు యూనిఫాంల పరిస్థితిని కూడా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యుద్ధప్రాతిపదికన రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.












