వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వేదిక జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న ముదిరాజ్ పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని ఛత్రపతి శంభాజీ మహారాజ్ ప్రాంగణంలో ఈ సభ జరగనుంది. ఈ సందర్భంగా యాటకారి సాయన్న ముదిరాజ్, వేదిక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ తో కలిసి వివిధ కాలనీలలో కరపత్రాలను విడుదల చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
తెలంగాణలో అధిక జనాభా కలిగిన వెనుకబడిన వర్గాలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, సమాన హక్కులు, అవకాశాల కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన అన్నారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం చైతన్యంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ నెల 27న జరిగే సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి, వెనుకబడిన, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాల ఐక్యతను ప్రదర్శించాలని ఆయన కోరారు. ఈ సభ ద్వారా తమ హక్కుల కోసం గళమెత్తాలని పిలుపునిచ్చారు.








