మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) శనివారం ఆకస్మికంగా సందర్శించి, అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే బిఎల్ఆర్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తూకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన స్థానిక రైతులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి అని, నియోజకవర్గంలోని రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే బిఎల్ఆర్ హామీ ఇచ్చారు.
ఐకేపీ సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.












