నల్లగొండ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 19
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ దారుణానికి పదో తరగతి విద్యార్థి వంశీతో పాటు మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి పదో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థి పాల్పడినట్లు, అతనికి మరో వ్యక్తి సహకరించినట్లు నిర్ధారించారు. హత్యకు గల కారణాలపై ఇంకా విచారణ జరుగుతోంది.
ఘటన వివరాలు
మృతురాలు కె. రూపారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆమె ఒంటిపై అనేక కత్తిపోట్లు కనిపించాయి. హంతకుడు గ్లౌజులు ధరించడంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో కేసు ఛేదన పోలీసులకు సవాలుగా మారింది.
దర్యాప్తు తీరు
లభ్యమైన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా హంతకుడి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు తొలుత అంచనా వేశారు. పాఠశాల సిబ్బంది, కాలనీ వాసులు, కుటుంబ సభ్యులను విచారించారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత శనివారం ప్రత్యేక నిఘా విభాగం (స్పెషల్ బ్రాంచ్) పోలీసులు కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులను గుర్తించారు.
ప్రత్యేక బృందాల విచారణ
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటై దర్యాప్తు ముమ్మరం చేశాయి. సుమారు 80 మందిని విచారించిన అనంతరం కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులు ఈ హత్యకు పాల్పడ్డారని గుర్తించారు.
అదుపులోకి ముగ్గురు
నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, ముగ్గురిపై అనుమానం రావడంతో ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. రూపారెడ్డి హత్య అనంతరం ఆ విద్యార్థులు సుమారు రూ.4 లక్షల నగదు చోరీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తి వివరాలు బుధవారం
ఈ విషయమై పోలీసులు న్యూస్టుడేతో మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం లోగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు.












