ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కోసం అవగాహన మరియు ప్రేరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డా. సాప పండరి హాజరయ్యారు.
డా. సాప పండరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, పరీక్షల పట్ల భయాన్ని వీడి, ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువుల గౌరవాన్ని పెంచాలని ఆయన విద్యార్థులను కోరారు.
అలాగే, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అవి జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. పండుగలప్పుడు సహజ రంగులనే వాడాలని, రసాయన రంగుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు కొండవార్ సంజీవ్, కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, ప్రధానాచార్యులు సారథి రాజు, అకాడమిక్ ఇంచార్జ్ స్వప్న శర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డా. సాప పండరిని పాఠశాల యాజమాన్యం సన్మానించింది.


