న్యాయవాద వృత్తి గౌరవాన్ని కాపాడాలని, డబ్బు, కానుకల కోసం ఓటును అమ్ముకోవడం న్యాయవాదుల వ్యక్తిత్వానికి అవమానమని మేడా శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల సందర్భంలో కొందరు న్యాయవాదులు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ఓటు విలువను అమ్ముకోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయవాది అనే గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు బలహీనతలకు లోనై తమ ఓటును డబ్బు, మద్యం, బిర్యానీ వంటి ప్రలోభాలకు అమ్ముకోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఓటును అమ్ముకున్న వ్యక్తి తన ప్రతిభను, గౌరవాన్ని కూడా తక్కువ చేసుకుంటున్నాడని తెలిపారు.
న్యాయవాదులపై ప్రజల్లో గౌరవం తగ్గడానికి ఇటువంటి చర్యలే కారణమవుతున్నాయని మేడా శ్రీనివాస్ తెలిపారు. ఒకప్పుడు “లాయర్ గారు” అని గౌరవంగా పిలిచే స్థాయి నుంచి ఇప్పుడు తక్కువగా మాట్లాడే పరిస్థితి రావడం విచారకరమన్నారు. తమ క్లయింట్ల ముందు తలెత్తుకొని నిలబడే స్థాయి కోల్పోతున్నామని ఆయన చెప్పారు.
నోట్లతో, కానుకలతో ఓట్లు కొనాలనే భావనతో ఎన్నికల్లో దిగుతున్న అభ్యర్థులు కూడా సహచర న్యాయవాదుల నమ్మకాన్ని గెలవలేరని మేడా శ్రీనివాస్ విమర్శించారు. న్యాయవాద వృత్తికి అర్హత లేని వ్యక్తులు ఇలాంటి ప్రవర్తనకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.
న్యాయవాదులు తమ వృత్తి గౌరవాన్ని కాపాడుకోవాలని, న్యాయ ప్రతిష్టను నిలబెట్టే మార్గదర్శకులుగా నిలవాలని మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హక్కులు, భద్రత, ప్రతిష్ట కోసం ఐక్యంగా కృషి చేస్తేనే న్యాయవాదుల సమాజం బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఓట్లు అమ్ముకునే న్యాయవాదులకే వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

