నిజామాబాద్, జూలై 24
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆడంబరాలకు దూరంగా ప్రజాసేవా కార్యక్రమాలతో వేడుకలు జరుపుకోవాలనే పార్టీ నాయకత్వం పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రక్తదానం, మొక్కలు నాటడం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆడంబరాలకు దూరంగా ప్రజాసేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలను నిర్వహించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్మూర్‌కు చెందిన యువకులు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఇంచార్జి వి.జీ. గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్, బోధన్ ఇంచార్జి దాదాన్నగారి విఠల్‌రావు పాల్గొని మొక్కలు నాటారు. అలాగే అర్బన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాగూర్, సత్యప్రకాశ్, బి. శ్రీనివాస్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వి.జీ. గౌడ్, దాదాన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రిగా పనిచేసిన సమయంలో సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు అందించి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చారని అన్నారు. ప్రతి జిల్లాలో ఐటీ హబ్‌ల ఏర్పాటు, యువతకు ఉద్యోగావకాశాల కల్పన, గ్రీన్ ఫ్రైడే–సండే కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారని కొనియాడారు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తున్న కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ జిల్లా నాయకత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.












