కరీంనగర్ జిల్లాలో ఒక సెలూన్ నిర్వాహకుడిపై దాడి చేసిన కేసులో ఎస్సై ఎన్. చైతన్య చందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దుర్గమ్మ గడ్డ, ఖాన్‌పురా ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో, 'న్యూ ప్రజా హెయిర్ స్టైల్' సెలూన్‌కు వెళ్లిన ఎస్సై చైతన్య చందర్, అక్కడి కార్మికుడైన పగడాల రాము (50)పై దాడి చేశారు. 'అన్నా కూర్చో' అని పలకరించినందుకు ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేసి, దూషించి, కొట్టినట్లు సమాచారం.
ఈ సంఘటన మొత్తం సెలూన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఎస్సై విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, విచారణ చేపట్టారు. ఎస్సై చైతన్య చందర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించారని విచారణ నివేదికలో తేలింది. దీని ఆధారంగా కరీంనగర్ సీపీ గౌష్ ఆలం, డి.ఐ.జి. సిఫారసు మేరకు ఎస్సైను సస్పెండ్ చేశారు.
పోలీస్ శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, చట్టాన్ని అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ సీపీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.












