నిర్మల్ జిల్లా, బైంసా మండలంలోని కామోల్ గ్రామ పంచాయతీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎనిమిదవ వార్డు సభ్యునిగా ఎన్నికైన షాపురం విట్టల్ కు ఘోర అవమానం జరిగింది. అభివృద్ధి పనులపై ప్రశ్నించినందుకు, అనుమతి లేని వ్యక్తులచేత ఆయనను కార్యాలయం నుండి గల్లా పట్టి బయటకు గెంటించినట్లు వార్డు సభ్యుడు ఆరోపించారు.
శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో, వార్డు సభ్యుడు విట్టల్ గ్రామ పంచాయతీకి మంజూరైన నిధులు, ఖర్చుల వివరాలను సర్పంచ్ చింత చిన్నయ్య, కార్యదర్శి కూరె శివానంద్ లను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన సర్పంచ్, కార్యదర్శిలు, సమావేశానికి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులను ప్రోత్సహించి, వారిచేత విట్టల్ ను అవమానించి, బయటకు గెంటించినట్లు వార్డు సభ్యుడు ఆరోపించారు.
తనకు జరిగిన అవమానంపై వార్డు సభ్యుడు విట్టల్ ఎంపీఓకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంతోనే తాను ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతోనే వివరాలు అడిగానని, అయితే తనను అవమానించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారికి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజా ప్రతినిధికి జరిగిన అవమానంపై పలువురు విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్, కార్యదర్శిల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.












