ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌గా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బెంగళూరులో జరగనుంది.
దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ టోర్నీలో లీగ్ దశ మ్యాచ్‌లు మే 24 వరకు, ఫైనల్ పోరు మే 31న జరగనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ రాత్రి 7 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో ఆరంభం కానుంది. గతేడాది తొలిసారి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, సన్‌రైజర్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ, బీసీసీఐ ఎన్నికల తేదీలను పరిగణనలోకి తీసుకుని రెండు దశల్లో పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. తొలి దశ షెడ్యూల్ మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు 15 రోజుల పాటు సాగనుంది. 2022 నుంచి అమలవుతున్న ఫార్మాట్ ప్రకారమే ఈ సీజన్ కూడా నిర్వహించబడుతుంది.
మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో సీఎస్కే, కేకేఆర్, ఆర్ఆర్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఉండగా.. గ్రూప్-Bలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఆడనుంది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
ప్లే ఆఫ్స్ విధానం ప్రకారం, టాప్-2 జట్ల మధ్య క్వాలిఫయర్-1, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడుతుంది. మే 31న జరిగే ఫైనల్ పోరులో క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 విజేతలు టైటిల్ కోసం పోటీపడతారు.












