*( (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 16
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కలకలం రేపిన సీరియల్ మర్డర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయ హత్య కేసులో, ఆమెను అదే గ్రామానికి చెందిన తల్లి, కొడుకులు కలిసి బంగారం కోసం హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో నిందితురాలైన తల్లి చాకలి రజితను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు, ఆమె కొడుకును జువైనల్ హోమ్‌కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ (సీపీ) రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారులో కలకలం రేపిన పాక్షికంగా కాల్చిన గుర్తు తెలియని మృతదేహం కేసులో సిద్దిపేట పోలీసులు కీలక పురోగతి సాధించారు. భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయ (45) హత్య కేసులో, ఆమెను అదే గ్రామానికి చెందిన తల్లి, కొడుకులు కలిసి బంగారం కోసం హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితురాలైన తల్లి చాకలి రజితను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు, ఆమె కొడుకును జువైనల్ హోమ్‌కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ (సీపీ) రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
కేసు వివరాల్లోకి వెళితే, 08.08.2026న రామక్కపేట గ్రామ శివారులో వనం నర్సయ్య పొలం దగ్గర రోడ్డు పక్కన పాక్షికంగా కాలిన గుర్తు తెలియని మహిళా శవం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దుబ్బాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక పోలీసులతో పాటు సిసిఎస్, ట్రాన్స్పోర్ట్ విభాగాల ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి.
దర్యాప్తులో ఆ గుర్తు తెలియని శవం భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయగా గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు నిజం వెలుగు చూసింది. డబ్బులు సులభంగా సంపాదించాలనే దురుద్దేశంతో, అదే గ్రామానికి చెందిన నిందితురాలు చాకలి రజిత (38), ఆమె కొడుకు కలిసి పథకం ప్రకారం విజయ ఇంట్లోకి వెళ్లి, ఆమెను గొంతు నులిమి చంపారు. అనంతరం అదేరోజు రాత్రి మృతదేహాన్ని టీవీఎస్ వాహనంపై రామక్కపేట గ్రామ శివారులో రోడ్డు పక్కన పెట్రోల్ పోసి కాల్చివేశారు.
గతంలో కూడా వీరు 28/05/2026న డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న కుంట రేఖను ఇదే తరహాలో హత్య చేసి, అచ్చుమయిపల్లి గ్రామ అడవిలో కాల్చివేసినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే, గతంలో జూన్-2025లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ (భర్త జెన్నారెడ్డి) వాకింగ్ చేస్తుండగా ఆమెను కొట్టి, మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును కూడా వీరే దొంగిలించినట్లు తెలిసింది.
పోలీసులు నిందితుల వద్ద నుంచి 5.61 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు, బ్లూ కలర్ (నం. 151165), నగదు రూ. 1,03,000, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
ఈ తల్లి-కొడుకుల ముఠా టీ పాయింట్ల వద్ద కూర్చున్న వారి కదలికలను, ఆస్తులను గమనిస్తూ, ఆస్తి తగాదాలు లేదా ఇతర గొడవలు ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దోచుకోవడమే కాకుండా, వారిని హత్య చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరితో పాటు మరో నాలుగు హత్యలకు కూడా వీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తేలింది. ప్రతి నేరం తర్వాత పోలీసుల దృష్టిని మళ్లించేవారు.












