సోన్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజ పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. విద్యాబోధన, వసతి, భోజనం, పరిశుభ్రత ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
తరగతి గదులు, వంటశాల, సరుకుల నిల్వ, భోజనశాలలను కలెక్టర్ పరిశీలించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, నిల్వ పుస్తకాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.
పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారి జవాబు పత్రాలను పరిశీలించారు. గణితం, భౌతిక శాస్త్ర ప్రశ్నలు అడిగి అవగాహనను పరీక్షించారు. బోర్డుపై లెక్కలు చేయించి సమస్యల పరిష్కార విధానాన్ని వివరింపజేశారు.
శాస్త్రవేత్తల కృషి, విజ్ఞాన శాస్త్రం సమాజ అభివృద్ధిలో పాత్రను వివరించారు. సమకాలీన సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, వార్తాపత్రికలు, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రశ్నించే స్వభావం, సృజనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలు ఉన్నత లక్ష్య సాధనకు దోహదపడతాయని తెలిపారు.
విద్య, వసతి, భోజన సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ప్రత్యేక అధికారి సుధాకర్, తహసీల్దార్ సంతోష్, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.











