జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా, నిరంతరాయంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం లక్ష్మణచందా మండలంలోని తిరుపల్లి గ్రామంలోని గోదామును కలెక్టర్ సందర్శించి, ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు.
రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వెంట వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గోదాం నిల్వ సామర్థ్యం, నిల్వ చేసిన ధాన్యం పరిమాణం, అన్లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్యపై ఆరా తీసి, అవసరమైతే మరింత మందిని నియమించి అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. హమాలీలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ సరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.








