** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన జెన్ జీ యువత ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో విజయవంతమైంది. నీట్ లీకేజీ, పరీక్షల పారదర్శకత వంటి అంశాలపై దృష్టి సారించిన ఈ ఉద్యమం, తదుపరి దశలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై కేంద్రీకరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ మేరకు సంకేతాలిచ్చారు.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జెన్ జీ యువత చేపట్టిన పోరాటంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయం సాధించినట్లు ప్రకటించింది. నీట్ లీకేజీ, పరీక్షల పారదర్శకత, విద్యార్థులకు న్యాయం వంటి అంశాలపై సీజేపీ ప్రధానంగా పోరాటం సాగించింది. అయితే, భవిష్యత్తులో సీజేపీ కొత్తగా ఏ ఎజెండాను ముందుకు తెస్తుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలే ఇకపై తమ కొత్త ఎజెండాగా పోరాటం మొదలవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విశ్లేషకుల ప్రకారం, నీట్ లీకేజీ ఆందోళనలకు ముందే.. నిరుద్యోగులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ‘కాక్రోచ్లు’ వ్యాఖ్యలతోనే సీజేపీ పుట్టిందని, ఉద్యోగాలు, ఉపాధి కల్పన డిమాండ్ అప్పుడే మొదలైందని గుర్తు చేస్తున్నారు. తాము ప్రస్తుతానికి ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, అనేక ఇతర అంశాలపై తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రస్తుతానికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడటంపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు.
సీజేపీ చేపట్టిన ఆందోళనల్లో కేవలం నీట్ అభ్యర్థులు, విద్యార్థులే కాకుండా.. యూపీఎస్సీ, ఎస్ఎ్ససీ, రైల్వే, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది జెన్ జీ యువత, ఇంజనీరింగ్ పట్టభద్రులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, నియామక పరీక్షల లీకులు, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, భర్తీ ప్రక్రియల్లో పారదర్శకత వంటి అంశాలపై వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాక్రోచ్ పార్టీ, జెన్ జీ ఉద్యమం విద్యా పరీక్షల సమస్యను దాటి.. యువత భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే, సీజేపీకి పార్టీగా గానీ, సంఘంగా గానీ వ్యవస్థీకృత నిర్మాణం లేదని, కేవలం సోషల్ మీడియా ద్వారానే కార్యకలాపాలు కొనసాగాయని తెలిపారు. ఇకపై పోరాటాలకు ఈ స్థాయిలో యువతను సీజేపీ సమీకరించగలదా అనే సందేహాలూ ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.











